ప్రజాశక్తి-అమరావతి : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ‘కర్నూలులో హైకోర్టు బెంచ్ అవసరం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలి. హైకోర్టును విభజించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎపి పునర్విభజన చట్టం ప్రకారం బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి రావాలే తప్ప, ప్రభుత్వం నుంచి కాదు. భావోద్వేగాలు, మనోభావాలు, రాజకీయ కారణాలతో బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఇ-ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్ వంటి సౌకర్యాలు వచ్చాక బెంచ్ అవసరం లేదు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం 1985లో జస్వంత్ సింగ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. రాయలసీమకు చివర్లో కర్నూలు ఉంది. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ ఉన్న అమరావతిలోనే హైకోర్టు ఉండాలి. కర్నూలు కన్నా విజయవాడకే మంచి రోడ్డు, రైలు సౌకర్యం ఉంది. ఇదే విధంగా చేయడం మొదలుపెడితే రేపు, విశాఖపట్నం నుంచి కూడా డిమాండ్ రావచ్చు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలి’ అని న్యాయవాదులు తాండవ యోగేష్, తురగ సాయి సూర్య వేసిన పిల్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
