- అత్యవసర విచారణకు నిరాకరణ
ప్రజాశక్తి-అమరావతి : వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రిటైర్డు హైకోర్టు జడ్జితో విచారణకు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. తొక్కిసటాలో ఆరుగురు మరణించడంతో పాటు 40 మందికి పైగా గాయపడిన ఘటనపై అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపి 30 రోజుల్లో గవర్నర్‌కు నివేదిక ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కర్నూలు జిల్లా, పాండురంగాపురానికి చెందిన రైతు గుదిబండ ప్రభాకర్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట న్యాయవాది శివప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రస్తావించారు. లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర విచారణ జరపాలన్నారు. అత్యవసర విచారణ చేయబోమని, సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 17న అత్యవసర కేసుగా విచారిస్తామని బెంచ్ చెప్పింది.