ప్రజాశక్తి – నక్కపల్లి (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని హెటిరో డ్రగ్స్ కంపెనీలో మంగళవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువు లీకవ్వడంతో 12 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. కంపెనీ అంబులెన్స్‌లో తొలుత వారిని నక్కపల్లిలోని 50 పడకల ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ముగ్గురిని విశాఖకు తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారిలో కె.వీరబాబు, జి.గౌరి నాయుడు, జి.సుబ్రహ్మణ్యం, వై.శివ, వి.వరుణ్ కుమార్, జి.శివప్రసాద్, ఎ.వెంకటప్రసాద్, జి.రామకృష్ణ, జి.శ్రీనివాస్, బి.సతీష్, ఎం.దేవుడు, జి.దినేష్ ఉన్నారు. వీరిలో కె.వీరబాబు, జి.గౌరినాయుడు, జి.సుబ్రహ్మణ్యంలను మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగింది ?
కంపెనీలోని హెచ్ 7, హెచ్ 8 బ్లాక్‌ల మధ్య యూనిట్ 9 వద్ద బి షిఫ్ట్‌కు చెందిన కెమిస్ట్ ఉద్యోగులు ఏడున్నర గంటల ప్రాంతంలో క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు బ్లాక్ నుంచి బయటకు వచ్చారు. ఏదో వాసన వచ్చిందని, దగ్గు వచ్చి ఊపిరాడని పరిస్థితి నెలకొందని అస్వస్థతకు గురైన ఉద్యోగులు తెలిపారు. విషయం తెలుసుకున్న నక్కపల్లి, ఎస్.రాయవరం సిఐలు కుమారస్వామి, రామకృష్ణ నక్కపల్లి ఆస్పత్రికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రమాద ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. సోడియం హైపో క్లోరైడ్ లీక్ కావడంతో కంపెనీ ఉద్యోగులు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.శంకరరావు, జి.కోటేశ్వరరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీల్లో భద్రతా చర్యలు కొరవడ్డాయని, ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించాలని కోరారు. తాజా ప్రమాదంలో సమగ్ర విచారణ జరపాలన్నారు.