- మంత్రి నిమ్మల రామానాయుడు
- 2026 జులై నాటికి నిర్వాసితులను తరలించాలని ఆదేశం
ప్రజాశక్తి – పోలవరం : ఈ ఏడాది డిసెంబరు నాటికి పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గురువారం పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న ఆయనకు ఇంజనీరింగ్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, సిఇ కె.నరసింహమూర్తి, సిఇ ఆర్.రామచంద్రరావు, మెగా ప్రతినిధి అంగర సతీష్ స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయ ప్రాంతం నుంచి స్పిల్‌వే ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టులో నూతన డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతంలో ఛానల్ 800 వద్ద ప్యానెల్లో టి16 ప్లాస్టిక్ కాంక్రీటు పనులు, 750 ఛానల్ వద్ద ట్రెంచ్ కటింగ్ పనులు, ట్రెంచ్ కటింగ్ యంత్రాలను, గ్రాబ్ కటింగ్ యంత్రాలను, అనంతరం డీశాండింగ్ యంత్రాన్ని, బెంటోనైట్ ద్రవాల ట్యాంకులను, ఆ ప్రాంతంలో ఉన్న ల్యాబ్‌న్ పరిశీలించారు. బావర్ కంపెనీ ప్రతినిధి హసన్, ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోలు అధికారులు సంబంధిత వివరాలను మంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరిలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభించామని, నిర్మాణ పనులు సగం పూర్తవగానే ఇసిఆర్‌ఎఫ్ డ్యామ్ పనులు మొదలు పెడతామన్నారు. పాత డయాఫ్రం వాల్ నిర్మాణం బదులు కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణానికి రూ.వెయ్యి కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. 45.72 మీటర్ల ఎత్తుకు పునరావాస పనులు పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందిస్తున్నా మన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి రెండో కట్టర్ పని ప్రారంభిస్తుందని, మూడో కట్టర్ ఏప్రిల్ నాటికి వస్తుందని, మూడు కట్టర్ల ద్వారా పనులు మరింత వేగవంతంగా జరుగుతాయని వివరించారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా ప్రాజెక్టు నిర్మాణంతో పాటే సమాంతరం గా పునరావాస కాలనీలు కూడా నిర్మిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 నాటికల్లా పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో ఆర్‌అండ్‌ఆర్ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 జులై నాటికి నిర్వాసితులను తరలించడంతో పాటు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పునరావాస కాలనీల్లో దేవాలయాలు నిర్మించలేదని, శ్మశాన స్థలాలు చూపలేదని తమ దృష్టికి వచ్చిందని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఆర్‌అండ్‌ఆర్‌లో సిబ్బంది ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. వచ్చే వారం ముఖ్యమంత్రి పోలవరం పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయని సంబంధిత వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ బకాయిలను ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి వెంట ఎపి ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఇ డి తిరుమలరావు, ఇఇ వెంకటేశ్వరావు, రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ తదితరులు ఉన్నారు.