ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి నీటిని నిల్వ చేస్తామని, ఈ విషయంలో ఎంతమాత్రం రాజీపడబోమని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 41.14 మీటర్ల ఎత్తుకే నిర్మిస్తామని గత సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 29న కేంద్రానికి ప్రతిపాదన పంపిందని చెప్పారు. సవరించిన ధరను కమిటీ రూ.47,617 కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రకారం కేంద్ర కేబినెట్ పోలవరానికి రూ.12,157 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. వైసిపి నేతలు పోలవరంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రాజెక్టు డయాఫ్రం వాల్ ఇతర పనులను తిరిగి పునర్నిర్మిస్తామన్నారు.