ప్రజాశక్తి – తణుకు రూరల్ (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగిన సిఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్‌ను పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు ఎస్‌విఎం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు సిఎం చేరుకున్నారు. ఆయనకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అదే క్రమంలో సిఎంకు స్వాగతం పలికేందుకు స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి వెళ్లేందుకు ప్రయత్నించగా జాబితాలో పేరు లేదని పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. జిల్లా ఎస్‌పి అద్నాన్ నయీం అస్మీ జోక్యంతో ఆయనను పోలీసులు హెలిప్యాడ్ వద్దకు అనుమతించారు. సిఎంకు స్వాగతం పలికే జాబితాలో స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పట్టాభి చైర్మన్‌గా ఉన్న స్వర్ణాంధ్ర కార్పొరేషన్‌కు సంబంధించిన కార్యక్రమంలో ఆయన పేరు లేకపోవడంతో టిడిపి శ్రేణుల్లో కొంత అసహనం వ్యక్తమైంది.
