మాజీ మంత్రి రజనీని తోసివేసిన పోలీసులు

May 10,2025 21:07 #Ex-minister Rajani

 అనుచరుడి అరెస్టులో హైడ్రామా
ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : మాజీ మంత్రి విడదల రజని అనుచరుడు ఎం.శ్రీకాంత్‌రెడ్డిని పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్‌రెడ్డిపై పలు కేసులు ఉన్నాయని, అందువల్ల అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంతోపాటు గత ప్రభుత్వ హయంలో కాంట్రాక్టులు ఇప్పిస్తానని కొంతమంది వద్ద డబ్బు తీసుకుని మోసం చేసినట్టు కేసులు ఉన్నాయి. నాదెండ్ల మండలం జంగాలపల్లిలో పలువురు వైసిపి కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ మంత్రి విడదల రజని శనివారం వెళ్లారు. ఆమెతో పాటు అదే కారులో వెళ్లిన శ్రీకారత్‌రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా విడదల రజని అడ్డుపడ్డారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారు? వారెంటు ఉందా? అని ప్రశ్నించారు. విడుదల రజని అడ్డుగా ఉండడంతో ఆమెను పక్కకి పో.. అంటూ పోలీసులు నెట్టేశారు. తరువాత శ్రీకారత్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని చిలకలూరిపేటకు తరలించారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన సందర్భంలో ఆమె తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసు అధికారులు తెలిపారు. అయినా మాజీ మంత్రిగా గౌరవించి పక్కకు పంపి శ్రీకాంత్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని సిఐ సుబ్బానాయుడు చెప్పారు.

➡️