ధర్మవరంలో ఉద్రిక్తత

Jan 26,2025 23:59 #anathapuram, #Dharmavaram, #police
  • టిడిపి, బిజెపి నాయకుల మధ్య ఘర్షణ
  • పోలీసుల మోహరింపు

ప్రజాశక్తి – ధర్మవరం రూరల్‌ : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ వైసిపి నేత బిజెపిలో చేరే విషయంలో కూటమి పార్టీలైన టిడిపి, బిజెపి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. టిడిపి నాయకుల వాహనాలపై బిజెపి నాయకులు కట్టెలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా డిఎస్‌పి హేమంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఘర్షణల కారణంగా పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ధర్మవరానికి చెందిన వైసిపి నాయకుడు బిజెపిలో చేరే విషయంలో టిడిపి, బిజెపి నాయకుల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. వైసిపి నాయకుడు బిజెపిలోకి చేరే విషయంలో టిడిపి నాయకులు విబేధించినట్లు తెలిసింది. ఆ నాయకుడిని తాము తమపార్టీలోకి చేర్చుకుంటామని బిజెపి నాయకులు పట్టుపట్టడంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతారణం నెలకొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా డిఎస్‌పి హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యతని, శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసు విభాగం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.

➡️