ఎపిలో పెరిగిన రాజకీయ హత్యలు : NCRB report

అమరావతి  :    గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హింసాకాండ తారాస్థాయికి చేరింది. ఇటీవల రాష్ట్రంలో రెండు రాజకీయ హత్యలు జరిగాయి. తాజాగా ఎపిలో రాజకీయ హింసపై నేషనల్‌ క్రైమ్‌ రిపోర్ట్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక వెల్లడించింది. 2018 -2022 మధ్య ఎపిలోని వివిధ ప్రాంతాలలో రాజకీయ కారణాలతో 16 మంది మరణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. 2018-22 మధ్య 244 రాజకీయ ప్రత్యర్థుల మధ్య కొట్లాటలు జరిగినట్లు నివేదిక తెలిపింది.

ఇటీవల రాష్ట్రంలో రెండు రాజకీయ హత్యలు జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. రాజకీయ హత్యల్లో ఈశాన్య రాష్ట్రాలైన బీహార్‌ (16), జార్ఖండ్‌ (7)లను వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచింది.

రాజకీయ ఆధిపత్యం కోసం 2023 జులైలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు యెగిరెడ్డి కృష్ణ (58) దారుణ హత్య ఎపిలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలోని కొత్త పేట గ్రామంలో రాజాంటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ హత్య జరగడం గమనార్హం. ఈ హత్యతో రాష్ట్రంలో రాజకీయ హత్యలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణ హత్యతో ప్రశాంత వాతావరణం ఉండే ఉత్తర కోస్తా తీరంలో రాజకీయ హింస సంస్కృతి ఎలా విస్తరించిందో తెలియజేసింది.

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మార్చి 15న పులివెందులలో జరిగిన మాజీ ఎంపి వై.ఎస్‌ వివేకానంద రెడ్డి హత్య ఘటన రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి దారితీసింది. ఈ హత్య వెనుక ఉన్న నిందితులను ఇప్పటికీ గుర్తించలేదు. ఐదేళ్లు గడిచినా హత్య కేసు చేధించకపోవడంతో ఇటీవల సిబిఐ చేతుల్లోకి వెళ్లింది.
ఇటీవల ప్రకాశం, నంద్యాల మరియు పల్నాడు జిల్లాల సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌పిలు) చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సిఇఒ) ముకేష్‌ కుమార్‌ మీనా ఎదుట హాజరయ్యారు. ఎలక్షన్‌ షెడ్యూల్‌ విడుదలైన అనంతరం ఆయాజిల్లాల్లో నెలకొన్న హింసాకాండపై సిఇఒకు వివరణనిచ్చారు.

రాజకీయ హత్యల్లో ఎపి మూడో స్థానం
రాజకీయ హత్యల్లో ఎపి మూడోస్థానంలో   నిలిచినట్లు ఎన్‌సిఆర్‌బి నివేదిక తెలిపింది . 2019లో 5 హత్యలు జరగగా, 2020లో 6, 2022లో 4 హత్యలు జరిగాయి. 2022లో గుంటూరు జిల్లాలో రాజకీయ నేత తోట చంద్రయ్యను దారుణంగా హత్య చేశారు. 2023  ఏప్రిల్‌లో  కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో మరో నేత శంకర్‌ రెడ్డి హత్యకు గురయ్యారు.  ఏలూరు జిల్లా జి కొత్త పల్లిలో జి.ప్రసాద్‌ను రాజకీయ ప్రత్యర్థులు హత్య చేశారు.   గండికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని గిద్దలూరులో 2024 మార్చిలో  ర్యాలీలో పాల్గొన్న  మున్నాయ్  పై క్రూరమైన దాడి జరిగింది.   ఇదే నెల ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో చాగలమర్రిలో ఇమామ్‌ హుస్సేన్‌ను హత్యకు గురయ్యారు.   మాచర్లలో ఓ రాజకీయ నేత కారుకి నిప్పటించారు.  ఈ విధంగా  రాజకీయ   ప్రత్యర్థులపై  హింసాత్మక దాడులు పెరుగుతూనే ఉన్నాయి.

➡️