పొన్నవోలు పిటిషన్‌ డిస్మిస్‌

ప్రజాశక్తి-అమరావతి : గత వైసిపి సర్కారులో ఉన్న భద్రతను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి సోమవారం తీర్పు చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వ పాలకులకు వ్యతిరేకంగా వాదించినందున తనకు ప్రాణహాని ఉందంటూ పొన్నవోలు వాదనను తోసిపుచ్చారు. పొన్నవోలుకు ఎలాంటి ప్రాణహాని లేదని భద్రత సమీక్ష కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. కాబట్టి పొన్నవోలుకు భద్రతను కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేమని తీర్పులో పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్‌ చూపించే రెడ్‌బుక్‌లో పొన్నవోలు పేరు చేర్చారనేది మీడియాలో వచ్చిన వార్తలేనని, మీడియా వార్తల ఆధారంగా దానిపై స్పందించలేమని తేల్చి చెప్పారు.

➡️