పోసానిపై ఆ సెక్షన్‌ ఎలా పెడతారు?

  • సూళ్లూరుపేట ఇన్‌స్పెక్టర్‌ చర్యపై హైకోర్టు ఆగ్రహం

ప్రజాశక్తి, అమరావతి : నటుడు పోసాని మురళీకృష్ణపై సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్‌ ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీపై కోర్టుధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని ఇన్‌స్పెక్టర్‌కు ఫాం 1 నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. అప్పటి వరకు పోసానిపై కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సోషల్‌ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బిఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద కేసు నమోదు చేయడంపై మండిపడింది. తమ ఆదేశాలున్నా కూడా పోసానిపై అదనపు సెక్షన్లు నమోదు చేయడాన్ని ఆక్షేపించింది. అరుదుగా వినియోగించాల్సిన సెక్షన్‌ 111ను ఎలా అమలు చేస్తారని తిరుపతి జిల్లా, సూళ్లురుపేట ఇన్స్పెక్టర్‌ను నిలదీసింది. మీపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టిటిడి చైర్మన్‌, టివి 5 యజమాని బొల్లినేని రాజగోపాల్‌ నాయుడుని పోసాని దూషించారంటూ టీవీ 5 ఉద్యోగి బొజ్జా సుధాకర్‌ గత ఏడాది సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు పోసానికి సెక్షన్‌ 35(3) కింద జారీ చేసిన నోటీసుల్లోని సెక్షన్లే కాకుండా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111తో పాటు పలు ఇతర సెక్షన్లను జత చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

➡️