పోసానికి 20 వరకు రిమాండ్‌

  • విజయవాడ సిఎంఎం కోర్టులో హాజరు
  • మళ్లీ కర్నూలు సబ్‌ జైలుకు తరలింపు

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ (విజయవాడ) : సినీ నటుడు, వైసిపి నాయకులు పోసాని కష్ణమురళికి ఈ నెల 20 వరకు రిమాండ్‌ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటి వారెంట్‌పై శనివారం కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయనను విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్‌కు పోలీసులు తరలించారు. అనంతరం విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటిన్‌ మెజిస్ట్రేట్‌ (సిఎంఎం) కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు ఈనెల 20 వరకు రిమాండ్‌ విధించడంతో పోసానిని తిరిగి కర్నూలు సబ్‌ జైలుకు తరలించారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, మీడియా సంస్థలపై దూషణలు, సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై గత ఏడాది నవంబరు 12న జనసేన నేత శంకర్‌ ఫిర్యాదు మేరకు విజయవాడ భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది.
ఒకే కేసుల్లో వివిధ స్టేషన్లకు తిప్పుతున్నారు : న్యాయమూర్తి ఎదుట పోసాని
తనపై అక్రమంగా కేసులు పెట్టారని, ఒకే విధమైన కేసులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ తిప్పుతున్నారని కోర్టులో హాజరు పరిచిన సమయంలో పోసాని న్యాయమూర్తికి తెలిపారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని, గుండె జబ్బు, పక్షవాతం లాంటి రుగ్మతలు ఉన్నాయని చెప్పారు. తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని, తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని కోరారు. పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేననిన్యాయమూర్తి తెలిపారు.

➡️