ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన పోరాటం మరింత ఉధృతం చేయడంలో భాగంగా ప్రధానమంత్రికి మరోమారు పోస్టుకార్డులు పంపిస్తున్నామని స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్ తెలిపారు. స్టీల్‌ప్లాంట్ సెంట్రల్ స్టోర్ జంక్షన్ వద్ద యూనియన్ ఆధ్వర్యాన గురువారం పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్ మాట్లాడుతూ… విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడపాలని, సొంత గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. పదివేల కోట్లు సహాయం చేస్తే ప్లాంట్‌ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడపడంతో పాటు యువతకు, నిర్వాసితులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఏటా రూ.ఐదు వేల కోట్లు పన్నులు ప్రభుత్వానికి వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. సామాన్య ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ అందుతుందని, రైతులకు పుష్కల బ్రాండ్ పేరుతో అమ్మోనియా లభిస్తుందని, ప్రజలకు చౌకగా స్టీల్ అందించే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ విధానాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు. ఈ పోస్టుకార్డు ఉద్యమంలో యూనియన్ అధ్యక్షులు వైటి.దాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ బి.అప్పారావు, గంగాధర్, టివికె.రాజు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న అన్ని విభాగాల నుంచి పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.