ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :అభివృద్ధి చేసే పేరుతో ఇ-ఆఫీస్‌ను కొద్దిరోజులు మూసివేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఇదే విషయాన్ని శుక్రవారం వెబ్‌సైట్‌లో కూడా ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కీలకమైన ఫైళ్లను మాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర గవర్నర్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో ఇసితోపాటు రాష్ట్ర గవర్నర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. వారి నుండి వచ్చిన సూచనలతో ప్రస్తుతానికి అప్‌గ్రేడేషన్ నిర్ణయాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న సైట్‌ను 7.ఎక్స్‌కు అభివృద్ధి చేయాలని నిర్ణజయించిన ప్రభుత్వం, శుక్రవారం నురచి 25వ తేదీ వరకు సైట్‌ను నిలుపు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఫిర్యాదులు అందిన నేపధ్యంలో ఎన్నికల నియమావళి ఉన్న సమయంలో అభివృద్ధి పేరిట ఎందుకు నిలిపివేయాలని నిర్ణయించారని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల నిలుపుదల నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
