ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్‌సి నోటిఫికేషన్ వాయిదా పడింది. 16,347 పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పోస్టుల రిజర్వేషన్‌కు సంబంధించి ప్రక్రియ పూర్తికాకపోవడంతో నిలిచినట్లు సమాచారం. ఎస్‌సి వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఎస్‌సి వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాదిగ పోరాట రిజర్వేషన్ సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కలిసి.. ఎస్‌సి వర్గీకరణ చేసి డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది. ఈ అంశంపై విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సిఎం భావిస్తున్నట్లు సమాచారం.
