ప్రజాశక్తి- అమరావతి : సినీనటి కాదంబరి జత్వానీ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పలువురు పోలీస్ అధికారుల పిటిషన్లల్లో కౌంటర్లు దాఖలు చేసేందుకు సిఐడి మరోసారి గడువు కోరింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపిఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, గతంలో ఎసిపిగా చేసిన హనుమంతరావు, అప్పటి దర్యాప్తు అధికారి సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వేర్వేరుగా వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీటిలో కౌంటర్ వేసేందుకు గడువు కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ కోరారు. దీంతో, విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ విఆర్‌కె కృపాసాగర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ల నమోదైన కేసులో వారంతా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
