ప్రజాశక్తి-అమరావతి : గ్రూప్-2 నోటిఫికేషన్‌లో వికలాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ నిమిత్తం ఈ నెల 23న నిర్వహించనున్న ప్రధాన పరీక్షను నిలుపుదల చేయాలని అనుబంధ పిటిషన్ దాఖలైంది. వీటిని మంగళవారం విచారణ పూర్తి చేసిన జస్టిస్ సుబ్బారెడ్డి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్కే సబర్వాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా గ్రూప్-2 పోస్టుల భర్తీకి రిజర్వేషన్ల రోస్టర్ను ఖరారు చేయాలని ఎం పార్థసారధి పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీలో ఆ రిజర్వేషన్ల కల్పనతో ప్రత్యేక రోస్టర్ను ఖరారు చేయడాన్ని కడపకు చెందిన కనుపర్తి పెంచలయ్య, ఇతరులు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 ప్రధాన పరీక్షను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాదులు కోరారు. దీనిపై ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తయిందని అన్నారు. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
