కదం తొక్కిన పౌల్ట్రీ కార్మికులు

  • ఎమ్మెల్యే కళా వెంకటరావు కార్యాలయానికి 18 కిలో మీటర్ల సామూహిక రాయభారం
  • తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి

ప్రజాశక్తి-చీపురుపల్లి (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ వెంకట రామ పౌల్ట్రీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కదం తొక్కారు. తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, స్థానికులకే 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సామూహిక రాయభారం పేరిట సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం సుమారు 18 కిలో మీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. కర్లాం నుండి చీపురుపల్లిలోని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు టివి రమణ, స్థానిక నాయకులు అంబల్ల గౌరు నాయుడు మాట్లాడుతూ.. వెంకటరామ పౌల్ట్రీ యాజమాన్యం కార్మికుల బతుకులతో ఆటలాడుకుంటోందని అన్నారు. కొంతకాలంగా కార్మికులు పౌల్ట్రీ నుండి వస్తున్న కంపును భరిస్తూ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పౌల్ట్రీ అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. అలాంటిది 25 మంది కార్మికులను అన్యాయంగా విధుల నుండి తొలగించడం దుర్మార్గమని అన్నారు. కార్మికులపై అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పౌల్ట్రీ యాజమాన్యాయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక యువతను కాదని వేరే రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకొచ్చి పౌల్ట్రీలో పనులు చేయించుకుంటున్నారని, ఇది సరైన పద్దతి కాదని తెలిపారు. చట్ట ప్రకారం స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. చీపురుపల్లిలో ఎమ్మెల్యే లేకపోవడంతో ఆయన కుమారుడు టిడిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాం మల్లిక్‌ నాయుడును సిఐటియు నాయకులు, కార్మికులు కలిసి తమ సమస్యను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, పౌల్ట్రీ కార్మిక నాయకుడు ఇప్పిలి గురునాయుడు, టి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️