విద్యుత్‌ ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలి

  • సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విద్యుత్‌ ప్రైవేటీకరణ విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజినీర్స్‌ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. విజయవాడ బందరు రోడ్డులోని బాలోత్సవ భవన్‌లో మంగళవారం విద్యుత్‌ రంగంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా చండీగఢ్‌లో విద్యుత్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. లాభాల బాటలో నడుస్తున్న డిస్కమ్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. స్మార్ట్‌ మీటర్లను తక్షణమే రద్దు చేయాలని, అదానితో కుదుర్చుకున్న అన్ని రకాల ఒప్పందాలనూ రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుదర్శనరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి సత్యనారాయణ, ఎంసిహెచ్‌ వీరాంజనేయులు, నాయబ్‌ రసూల్‌, జివి రాఘవయ్య, పి చంద్రశేఖర్‌, సిపిడిసిఎల్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌ రాజు, డి వెంకటేశ్వరరావు, ఎస్‌పిడిసిఎల్‌ అధ్యక్షులు ఎన్‌ శివశంకర్‌, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు ముజఫర్‌ అహ్మద్‌, ఉమామహేశ్వరరావు, పి అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️