అంబేద్కర్‌ స్మృతివనం నిర్వహణకు  పిపిపి మోడ్‌ వొద్దు : కెవిపిఎస్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడలోని పిడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతి వనం పిపిపి పద్ధతిలో నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్మృతివనంలో మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశా జారీ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంబేద్కర్‌ స్మృతి వనంలో థియేటర్‌, వాణిజ్య సముదాయం, బుక్‌ స్టాల్స్‌, ఆడిటోరియం, ఫుడ్‌ కోర్టు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వ నిధులు కేటాయించి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. వ్యాపార కేంద్రంగా చేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ను అవమానించొద్దని, ఈ దుర్మార్గమైన విధానంపై పౌర సమాజం స్పందించాలని కోరారు.

ఇన్‌ సర్వీస్‌ బిఇడికి అవకాశం ఇవ్వాలి

రాష్ట్రంలో దళిత మహిళా ఉపాధ్యాయులకు ఇన్‌ సర్వీస్‌ బిఇసి చేసేందుకు అవకాశం ఇవ్వాలని కెవిపిఎస్‌ కోరింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ విజయరామరాజును అండ్ర మాల్యాద్రి మంగళగిరిలోని విద్యాభవన్‌లో శనివారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. విద్యాశాఖ పరిధిలో ఇన్‌టైంలోనే అప్లై చేసి, సర్టిఫికెట్లన్నీ ఇవ్వడమే కాకుండా, ఎన్‌ఒసి కూడా ఇచ్చినా అనేక మంది దళిత మహిళా ఉపాధ్యాయులకు ఇన్‌ సర్వీస్‌ బిఇడి చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు. దీనివల్ల వీరంతా ఈ విద్యా సంవత్సరం నష్టపోతారని తెలిపారు. వెంటనే అనుమతినిచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ విజయరామరాజు హామీ ఇచ్చినట్లు తెలిపారు. .

➡️