ప్రజాశక్తి – కె.కోటపాడు (అనకాపల్లి) : ప్రజాశక్తి విశాఖపట్నం డెస్క్ సబ్ ఎడిటర్ ఆర్‌కె.నాయుడు తండ్రి, కొరువాడ మాజీ సర్పంచ్ రెడ్డి రామునాయుడు (79) గురువారం అనారోగ్యంతో మృతిచెందారు. రామునాయుడు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. అంత్యక్రియలు తమ స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం కొరువాడ గ్రామంలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రామునాయుడుకు భార్య దేవుడమ్మ, కుమారుడు ఆర్‌కె.నాయుడు, కుమార్తె రవణమ్మ ఉన్నారు. రామునాయుడు కొరువాడ గ్రామ సర్పంచ్‌గా 1988 నుంచి 1995 వరకు పని చేశారు. 1995 నుంచి 2010 వరకు విశాఖ డెయిరీ పాల సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఆ సమయంలో రామునాయుడు తన సొంత స్థలాన్ని పాల సంఘం భవనానికి విరాళంగా ఇచ్చి డెయిరీ నిధులతో పాలకేంద్ర భవనాన్ని నిర్మించారు. ఇలా బహుముఖ సేవలతో గ్రామ ప్రజల మన్ననలు పొందారు.
రామునాయుడు మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ఫోన్‌లో ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, ప్రజాశక్తి ఎడిటర్ బి.తులసీదాస్, సిజిఎం వై.అచ్యుతరావు, విశాఖ జనరల్ మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు గండి నాయినిబాబు, రొంగలి ముత్యాల నాయుడు, వనము సూర్యనారాయణ, ప్రజా సంఘాల జిల్లా కన్వీనర్ ఎర్ర దేముడు తదితరులు సంతాపం ప్రకటించారు.