- మిగతా ఆరుగురికి జీవిత ఖైదు, జరిమానా
- నల్లగొండ ఎస్‌సి, ఎస్‌టి కోర్టు సంచలన తీర్పు
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ పట్టణంలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కులదురహంకార హత్య కేసులో సోమవారం నల్లగొండ ఎస్‌సి, ఎస్‌టి కోర్టు తుది తీర్పు ప్రకటించింది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించగా.. మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. సుభాష్ శర్మకు మరణ శిక్ష, మిగతా ఆరుగురికి జీవిత ఖైదు, జరిమానా విధించినట్టు జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 జనవరి 31న అమృత, ప్రణయ్ కులాంతర వివాహం చేసుకున్నారు. కూతురిపై అమితమైన ప్రేమ.. కులాంతర వివాహం ఇష్టంలేని అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ను హత్య చేసేందుకు హంతకులకు సుపారీ ఇచ్చాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద మాటు వేసిన నిందితులు ప్రణయ్ ను అతి కిరాతకంగా చంపారు. దీనిపై మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు చేశారు. నిందితులు ఎనిమిది మందిపై అండర్ సెక్షన్ ఎస్302 ఆర్ రెడ్‌విత్ 34, 120(బి) రెడ్ విత్ 109 ఐపిసి) (వి) ఆఫ్ ఎస్‌సి, ఎస్‌టి /ఎస్‌టి (పిఒఎ) యాక్టు 1989 , సెక్షన్ 25 (ఐఎన్‌ఎ) అండ్ 27 (3) ఆఫ్ అండ్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 1959 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి కోర్టులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఐదేళ్ల పాటు వాదోపవాదాల అనంతరం నిందితుల్లో మారుతిరావు బెయిల్‌పై బయటకు వచ్చి 2020లో హైదరాబాద్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సుభాష్ శర్మకు ఉరి శిక్ష, మహమ్మద్ అస్గర్ అలీ, మహమ్మద్ అబ్దుల్ బారి, మహమ్మద్ అబ్దుల్ కరీం, తిరునగరి శ్రవణ్, సముద్రాల శివ, ఎంఎ నిజాంకు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం కోర్టు తుది తీర్పును వెలువరించింది. ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Murder Case – సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య – కాసేపట్లో తుది తీర్పు