ప్రజాశక్తి-అమరావతి : జిఎస్‌టి ఎగవేత, బోగస్ ఇన్వాయిస్‌లతో నిధుల మళ్లింపు అభియోగాల కేసులో నిందితులుగా ఉన్న టిడిపికి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు ఇతరులను అరెస్టు చేయబోమని హైకోర్టుకు సిఐడి హామీ ఇచ్చింది. ఈ కేసులో ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ, కుమార్తె స్వాతితోపాటు ఇతరులు జోగేశ్వరరావు, బొగ్గవరపు అంకమ్మరావు, బొగ్గవరపు నాగమణి, బిఎస్‌ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఇండియా ఎమ్‌డి బలుసు శ్రీనివాసరావు నిందితులుగా ఉన్నారు. సిఐడి వినతి మేరకు కేసు విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ జస్టిస్ టి మల్లికార్జునరావు సోమవారం ప్రకటించారు. ఎపి స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఎపిఎసిఆర్‌ఎ) డిప్యూటీ డైరెక్టర్ ఎస్ సీతారామిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వారంతా హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను విచారణ చేసే నిమిత్తం పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు విజయవాడ ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో వేసిన పిటిషన్‌ను అక్కడి కోర్టు తిరస్కరించింది. ఈ చర్యను సిఐడి సవాల్ చేస్తూ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు తెలియజేయాలని జస్టిస్ టి మల్లికార్జునరావు ఆదేశించారు. విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
