సామాన్య యాత్రికులకు ప్రాధాన్యత

  • దసరా మహాోత్సవాల ఏర్పాట్లపై సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం

ప్రజాశక్తి- వన్‌టౌన్‌ (విజయవాడ) : దసరా ఉత్సవాల సందర్భంగా సామాన్య యాత్రికులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 3 నుండి 12వ తేదీ వరకు నిర్వహించే దసరా మహాోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 13 శాఖలూ సమన్వయంతో పనిచేయాలన్నారు. సందర్శకులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 250 సిపి కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. వివిఐపి దర్శనాలు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి పది గంటలకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు సమయం కేటాయించాలని సూచించారు. ఈ సమయంలో సామాన్య సందర్శకుల క్యూలైన్లు ఆపవద్దన్నారు. వృద్ధులకు, వికలాంగులకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతరాలయ దర్శనానికి అనుమతి ఇవ్వొద్దన్నారు. అన్నప్రసాదాలు, లడ్డులో నాణ్యత ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈసారి వాటర్‌ ప్యాకెట్లతోపాటు వాటర్‌ బాటిళ్లను కూడా (35 లక్షల బాటిల్స్‌) ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రత చేయాలని సూచించారు. ముఖ్యఅతిథిగా రావాలని కోరుతూ సోమవారం వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని స్వయంగా తాను ఆహ్వానిస్తానన్నారు. అక్టోబర్‌ 9వ తేదీ మధ్యాహ్నం మూలా నక్షత్రం రోజున అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన మంత్రికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి, కలెక్టర్‌ సృజన, నగర పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు, ఆలయ ఇఒ కెఎస్‌.రామారావు స్వాగతం పలికారు.

➡️