‘ఉక్కు’ పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం : ఒబిసి

Mar 12,2025 21:32 #Dharna, #Steel plant, #vizag

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా కార్మికవర్గం సిద్ధంగా ఉందని స్టీల్‌ప్లాంట్‌ ఒబిసి అసోసియేషన్‌ అధ్యక్షులు బి అప్పారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 1490వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌లోని పలు విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుతో స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని తెలిపారు. యువ కార్మికులు ప్లాంట్‌లోని పరిస్థితులను చూసి భయాందోళన చెందుతున్నారన్నారు. పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వకపోవడం వల్ల కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులు తగ్గిపోవడం వల్ల విధులు నిర్వహిస్తున్న కార్మికులపై పనిభారం పడుతోందని, 50 ఏళ్లు పైబడిన వారు ఉత్పత్తి కోసం ఆరోగ్యాలను ఫణంగా పెడుతున్నారని వివరించారు. ఈ విషయాన్ని ఉక్కు యాజమాన్యం గుర్తించాలన్నారు. ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరి వీడాలని కోరారు.

➡️