- నెల్లూరులో నేటి నుంచి సిపిఎం 27వ రాష్ట్రమహాసభ
- ప్రారంభించనున్న ఎంఎ బేబి
- నగరానికి చేరుకున్న అగ్రనేతలు
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : ప్రజా ఉద్యమ కేంద్రం నెల్లూరులో సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ శనివారం నాడిక్కడ ప్రారంభం కానుంది. మూడ్రోజులపాటు జరిగే మహాసభ సభకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఎటూ చూసినా మహాసభ సందడి కనిపిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రతినిధులు, ముఖ్యఅతిథులు నగరానికి చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని ఐదు ఉద్యమ కేంద్రాల నుంచి ప్రారంభమైన పతాక జాతాలు శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నాయి. అతిధులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మహాసభను సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి ప్రారంభించనున్నారు.3వ తేదీ నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ జరగనుంది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య వంటి మహనీయులు జన్మించిన గడ్డలో నిర్వహిస్తోన్న ఈ మహాసభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ‘ఇంటికో మనిషి… ఊరుకో బండి… నెల్లూరు తరలిరండి” అనే నినాదంతో ప్రదర్శన, బహిరంగ సభ విజయవంతా నికి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడ్రోజులు ప్రతినిధుల సభ నిర్వహించే మాగుంట లేవుట్‌లోని అనిల్ గార్డెన్ వద్ద ఏర్పాట్లను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు పి.మధు పరిశీలించారు. ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులూ జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనం, వసతి, రవాణా, వైద్యం అన్ని విషయాలనూ దగ్గరుండి చూస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా వేదిక
ప్రతినిధుల సభ వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. భారీ ఎల్‌ఇడి స్క్రీన్లు ఆకర్షణగా ఉన్నాయి. పుచ్చపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య నిలువెత్తు ప్లెక్సీలతోపాటు, సీతారాం ఏచూరి చిత్రం స్క్రీన్‌పై ఉండేలా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇఎంఎస్ నంబూద్రిపాద్, బుద్దదేవ్ భట్టాచార్య, ఫొటోలు పెట్టారు. ప్రతినిధుల సభ వద్ద కేరళ తరహా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వాగత ద్వారాల వద్ద అటు,, ఇటు జాతీయ, రాష్ట్ర నాయకుల చిత్రపటాలు ఏర్పాటు చేశారు.
12 చోట్ల వసతి ఏర్పాట్లు
రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతినిధులు నగరానికి చేరుకుంటున్నారు వారికి 12 చోట్ల వసతి ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్లో వలంటీర్లను ఏర్పాటు చేశారు. మహాసభలో ప్రతినిధులకు సేవలందించడానికి సుమారు రెండు వందల మంది వలంటీర్లను సిద్ధం చేశారు.
నెల్లూరు చేరుకున్న ఐదు జాతాలు
రాష్ట్రంలోని ఐదు కేంద్రాల నుంచి ప్రారంభమైన పతాక జాతాలు శుక్రవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నాయి. వాటికి ఆహ్వాన సంఘం స్వాగతం పలికింది. 30 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా సిపిఎం నేతలు , కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు. నెల్లూరు చేరుకున్న సిపిఎం రాష్ట్ర నాయకత్వం, ప్రతినిధులకు ఆహ్వాన సంఘం ఘన స్వాగతం పలికింది.