17న రాష్ట్రానికి రాష్ట్రపతి రాక

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న రాష్ట్రానికి రానున్నారు. మంగళగిరిలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) మొదటి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు గురించి సిఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం ఏ చిన్నపాటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్‌ ఆదేశించారు. రాష్ట్రపతి 17న ఉదయం 11:20 గంటలకు భారత వాయుసేన విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని సిఎస్‌ తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12:05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్‌ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. అనంతరం తిరిగి గన్నవరం విమానాశ్రయానికి వెళతారని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబుతో పాటు కృష్ణా, గుంటూరు, ఎన్‌టిఆర్‌ జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్ల గురించి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డిజిపి హాజరై బందోబస్తు ఏర్పాట్ల గురించి సిఎస్‌కు వివరించారు. గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

➡️