ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు నగరపాలక సంస్థ భూగర్భ డ్రెయినేజీ పారిశుధ్య కార్మికురాలు వనపర్తి జయమ్మకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే వేడుకలకు హాజరు కావాలని ఆమెకు ఆహ్వాన పత్రిక అందింది. ఆహ్వాన పత్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ మంగళవారం తన ఛాంబర్‌లో జయమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. భూగర్భ డ్రెయినేజీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి పథకం లబ్ధిదారునిగా, సెప్టిక్ ట్యాంక్ వాహనానికి యజమానిగా ఉంటూ జయమ్మ స్వయం కృషితో విధులు నిర్వహిస్తోందని తెలిపారు. సహచర పారిశుధ్య కార్మికులకు ఆదర్శంగా నిలవటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అరుదైన గౌరవాన్ని కల్పించిందన్నారు. ఈ సందర్భంగా జయమ్మకు కమిషనర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్‌ఇ రామ్‌మోహన్ రావు పాల్గొన్నారు.