- 10న రాస్తారోకోలను జయప్రదం చేయాలి
- విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి రౌండ్ టేబుల్ సమావేశం
ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసి, పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపించే విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని టిడిపి కూటమి ఒత్తిడి తేవాలని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. విశాఖలోని జగదాంబ దరి సిఐటియు జిల్లా కార్యాలయంలో జెఎసి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ తమకు అధికారమిస్తే స్టీల్‌ప్లాంట్ అమ్మకం జరగదని, పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించి అభివద్ధి బాట పట్టిస్తామని రాష్ట్రంలోని టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎన్నికల్లో ప్రజలకు వాగ్ధానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వ చర్యలు స్టీల్‌ప్లాంట్‌ను మరింత అగాథంలోకి నెడుతున్నాయని విమర్శించారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 21 వేల టన్నులు కాగా నేడు కేవలం 6 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని తెలిపారు. ప్లాంటుకు అవసరమైన బొగ్గు, ఐరన్ ఓర్ తదితర ముడిసరుకులను రాకుండా కేంద్రం అడ్డుకుంటోందని, సొంత గనులు కేటాయించకుండా వివక్ష చూపుతోందన్నారు. ఫలితంగా ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.4 వేలు అదనంగా ఖర్చవుతోందని తెలిపారు. ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 536.6 మెగావాట్లు కాగా బొగ్గు కొరతను సృష్టించడంతో నేడు కేవలం 120 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. దీనివల్ల ప్రతి నెలా ప్లాంట్ ఎపిఇపిడిసిఎల్ నుంచి నెలకు రూ.45 కోట్లు నుండి రూ.80 కోట్ల విలువైన విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఒకప్పుడు 19 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 12,500 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది చివరకు 1400 మంది రిటైర్ కాబోతున్నారని, మరో 2500 మందిని విఆర్‌ఎస్ పేరుతో బయటకు పంపాలని చూస్తున్నారని, ఛత్తీస్‌గడ్‌లోని నాగర్‌నార్ స్టీల్‌ప్లాంట్‌కు 500 మందిని బదిలీ చేయాలని కేంద్రం కుట్రలు పన్నుతోందని తెలిపారు. ప్లాంట్‌కు రూ.7 వేల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే లాభాల బాట పట్టిస్తామని కార్మికులు కోరుతుంటే మోడీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఆఫీసర్లకు, పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డి.కుమారస్వామి ప్లాంట్‌లో పర్యటించి కర్మాగారాన్ని అమ్మే ప్రసక్తే లేదని ప్రకటించి రెండు నెలలు అవుతున్నా అతీగతి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10న జరిగే ఉక్కు రక్షణ రాస్తారోకోలను జయప్రదం చేయాలని కోరారు. విశాఖలో ఆ రోజు ఉదయం 10 గంటలకు జివిఎంసి గాంధీ విగ్రహం వద్దనున్న జెఎసి దీక్షా శిబిరం వద్ద ప్రదర్శన ప్రారంభమవుతుందని తెలిపారు. ఆర్‌టిసి కాంప్లెక్స్ ఆవరణలో రాస్తారోకో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, ఐఎన్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం, టిఎన్‌టియుసి జిల్లా కార్యదర్శి పైడిరాజు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎం.మన్మధరావు, పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.