ఉక్కు పరిరక్షణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి

  • విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఉక్కు పరిరక్షణ కోసం కేంద్రంలోని మోడీ సర్కారుపై రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం ఒత్తిడి తేవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో – కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 1439వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) కార్యకర్తలు కూర్చున్నారు. ఉక్కు ఉద్యమకారుడు అమృతరావు మనుమడు మోహన్‌ గాంధీ, ఆల్‌ ఇండియా జైహింద్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌.దశరథరామిరెడ్డి తదితరులు దీక్షా శిబిరానికి వచ్చి ఉక్కు పరిరక్షణ పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్‌ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం కోసం నాడు అమృతరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేసిన పోరాటాలను గుర్తు చేశారు. అటువంటి స్టీల్‌ప్లాంట్‌ను ఉద్యమాల ద్వారా కాపాడుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ఉక్కు పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటాల ఫలితంగానే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తాజాగా రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. దీని ద్వారా కొంత ఉపశమనం కలిగినప్పటికీ ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం కాదన్నారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు యు.రామస్వామి, ఎన్‌.రామారావు, పుల్లారావు, డిఎస్‌విఎస్‌.శ్రీనివాస్‌, వి.ప్రసాద్‌, కెఆర్‌కె.రాజు, కొయిలాడ శ్రీనివాస్‌, పెద్దిరెడ్ల దేముడు, ఎం.కోటేశ్వరరావు, డిసిహెచ్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️