ధరల మంట !

Jun 12,2024 08:37 #fire, #price

-అమాంతం పెరిగిన కూరగాయల రేట్లు
-భారీగా అల్లం ధర
-అదే బాటలో టమాట, పచ్చిమిర్చి
-కలవరపెడుతున్న ఆకుకూరలు, పప్పు దినుసులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :కూరగాయలు, ఇతర వంట సరుకుల ధరలు సామాన్యుని వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ‘ఏం కొనేటట్టు లేదు.., ఏం తినేటట్టు లేదు’ అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. రిటైల్‌ మార్కెట్లో వారం రోజుల్లో కూరగాయల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొన్ని ధరలు రెండు, మూడు రెట్లు కూడా పెరిగాయి. ఆకుకూరల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. కూరగాయలు కొనే బదులు చికెన్‌ కొందామనుకుంటే ఆ అవకాశమూ కనిపించడం లేదు. కిలో చికెన్‌ రూ.250 పలుకుతుండడంతో జనం ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నారు.
వారం క్రితం వరకూ టమాట కిలో రూ.20 ఉండగా, ప్రస్తుతం ఇది మూడింతలు పెరిగి రూ.60కు చేరింది. పచ్చిమిర్చిని ముట్టుకుంటే రేటు ఘాటు పుట్టిస్తోంది. వారం రోజుల క్రితం కిలో రూ.60 ఉండగా, ప్రస్తుతం రూ.100కు చేరింది. కేజీ ఉల్లి ధర గత వారం రూ.25 ఉండగా, ప్రస్తుతం రూ.50కు చేరుకుంది. కేజీ చిక్కుళ్లు ధర గత వారంలో రూ.40 ఉండగా, ప్రస్తుతం రూ.120కు చేరింది. క్యాప్సికమ్‌ కేజీ రూ.60 నుంచి రూ.100కు పెరిగింది. బీరకాయ ధర గత వారం రూ.60 ఉండగా, ప్రస్తుతం రూ.80కు చేరింది. అన్ని రకాల ఆకుకూరలు రూ.10కు మూడు కట్టలు ఇచ్చేవారు. ప్రస్తుతం రెండు కట్టలు మాత్రమే ఇస్తున్నారు. రూ.10కు దొరికే కొత్తిమీర కట్ట ఇప్పుడు రూ.40కు చేరింది. అల్లం ధర సామాన్యునికి అందనంత ఎత్తుకు చేరింది. పది రోజుల క్రితం కేజీ అల్లం రూ.80కు దొరికేది. ప్రస్తుతం రూ.280కి చేరింది. దీంతో, అల్లం కొనుగోలును సామాన్యులు ఆపేశారు.
కిరాణా సరుకుల ధరలూ రెండింతలు పెంపు
పలు కిరాణా సరుకుల ధరలు సైతం సామాన్యుడికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. నిత్యం వంట గదిలో ఉండాల్సిన వస్తువుల ధరలు అందనంత దూరం ఉన్నాయి. నెల రోజుల క్రితం వంద గ్రాముల జీలకర్ర ధర రూ.40 ఉండగా, ఇప్పుడు రూ.68కు చేరింది. వెల్లుల్లి కేజీ రూ.90 ఉండగా, ప్రస్తుతం రూ.150 ఉంది. పప్పు దినుసుల ధరలు కూడా కేజీకి రూ.20 నుంచి రూ.40 వరకూ పెరిగాయి.
అకాల వర్షాల వల్ల తగ్గిన ఉత్పత్తి
అకాల వర్షాలతో పంటలకు నష్టం కలగడం వల్లే కూరగాయలు, ఆకుకూరల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. నెల రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో పలు పంటలు దెబ్బతిని ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. దీంతో, పంట కొరత ఏర్పడంతో రేట్లు అమాంతం పెరిగాయని కూరగాయల విక్రయదారులు చెబుతున్నారు. ఎండలు తగ్గడంతో ఇప్పుడిప్పుడే వేసిన కూరగాయల పంటలు ఇంకా చేతికి రాలేదు. మరో 20 రోజుల్లో ఈ పంటలు చేతికందే అవకాశం ఉంది.

➡️