- ఉద్యాన శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ : కోకో గింజల ధర తగ్గింపుపై రైతులు కదంతొక్కారు. ఏలూరులోని జిల్లా ఉద్యాన శాఖాధికారి కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో కోకో రైతులు గురువారం ముట్టడించారు. కంపెనీలకు అనుకూలంగా ఉద్యాన శాఖాధికారులు కోకో గింజలకు తక్కువ ధర ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కోకో గింజలకు ధరల స్ధిరీకరణ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ నెల 7వ తేదీనాటికి ధరల ఒప్పంద నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇంతవరకు ధరలు ప్రకటించకుండా కంపెనీలు చెప్పిన తక్కువ ధరను ఉద్యాన శాఖాధికారులు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. అధికారులు తప్పుడు ప్రచారం మాని రైతులకు న్యాయం చేయాలని కోరారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకటన వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ పథకం వర్తింపజేసి కోకో రైతులను ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో కోకో రైతుల పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులతో ఉద్యాన శాఖ అధికారి మాట్లాడారు. మోండలీజ్ కంపెనీ ధరల ప్రచారం నిలుపుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు, పానుగంటి అచ్యుతరామయ్య, కె.రామిరెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, కోకో రైతులు పాల్గొన్నారు.