రాజధానిలో పలు సంస్థలకు కేటాయింపులు
కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయంలో రాజధాని భూములపై ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కమిటీలో మంత్రి నారాయణ, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి తదితరులు ఉన్నారు. ముఖ్యంగా రాజధాని పనులను 2025 జనవరి నుండి ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే పలు సంస్థలకు భూములు కేటాయించడంతోపాటు, గతంలో కేటాయించిన సంస్థల గడువు ముగిసిన నేపథ్యంలో వాటి గడువునూ పొడిగించారు. సమావేశం అనంతరం వాటి వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్‌కు ఐదెకరాలు కేటాయించారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు, బసవతారకం కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు 15 ఎకరాలు ఇచ్చారు. ఎల్‌అండ్‌టి స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఐదెకరాలు ఇచ్చారు. బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి పదెకరాలు ఇచ్చారు. వెంకటపాలెం వద్ద గతంలో టిటిడి దేవస్థానానికి ఇచ్చిన 25 ఎకరాలను పూర్తిగా దేవస్థానానికి కేటాయించేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 131 సంస్థలకు గతంలో భూములు కేటాయించామని, వాటితో మరికొన్ని సంస్థలకు అదనపు కేటాయింపులు చేశామని మంత్రి నారాయణ వెల్లడించారు. గతంలో భూములు కేటాయించిన వారికి అదే ధరకు ఇస్తున్నామని, దీనికోసం ఒక పాలసీని తయారు చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ నెలాఖరులోపు భూ కేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.