- మిట్టల్‌పై ఉన్న ప్రేమ, విశాఖ స్టీల్‌పై ఏదీ?
- బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులకు పరిహారమివ్వాలి
- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
- టిటిడి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోటి చెల్లించాలి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖపట్నం బహిరంగ సభలో రాష్ట్రప్రజల ఆకాంక్షలు, వారు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను నామమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం శోచనీయమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సిపిఎం రాష్ట్ర మహాసభ ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో నెల్లూరులో జరగనున్న నేపధ్యంలో పార్టీ రాష్ట్రకమిటీ సమావేశం విజయవాడలో బుధ, గురువారాల్లో జరిగింది. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు వై.వెంకటేశ్వరరావుతో కలిసి గురువారం ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ సభలో ప్రధాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకరినొకరు పొగుడుకోవడమే సరిపోయిందని అన్నారు.
విశాఖ వాసులతో పాటు, రాష్ట్ర ప్రజలందరు ఎంతగానో ఎదురుచూసిన విశాఖ ఉక్కు గురించి ఒక్కముక్క కూడా మాట్లాడలేదని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కార్మికులు నాలుగేళ్ల నుంచి ఆందోళన చేస్తు న్నారని,తెలుగుప్రజల ఆత్మగౌరవానికి సంకేతమైన దీనిపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశించా రని,కానీ అటువంటి ప్రకటన ఏమీ చేయలేదని అన్నారు. చంద్రబాబు తన ఉపన్యాసంలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ గురించి ప్రస్తావించారే తప్ప విశాఖస్టీల్ గురించి మాట్లాడలేదన్నారు. మిట్టల్‌పై ఉన్న ప్రేమ బలిదానాలతో ఏర్పాటైన విశాఖస్టీల్ ప్లాంట్‌పై లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రప్రభుత్వం చేసే ప్రయత్నాలకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు వంతపాడటానికి సిద్ధమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇది రాష్ట్ర ఆత్మగౌరవానికి, ప్రజలకు ద్రోహం చేయడం తప్ప మరోకటి కాదన్నారు. మిట్టల్ వంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఈ వైఖరిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలి పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీసేందుకు మిట్టల్ స్టీల్ వస్తోంది తప్ప తప్ప అదనంగా ఉపాధి కల్పించడానికి కాదన్నారు. అదనపు ఉపాధి కల్పించే ఉద్దేశ్యమే అయితే, ఓడరేవు ఉన్న నెల్లూరులోనో, ఇనుప గనులు దగ్గరగా ఉన్న రాయలసీమలోని కడపలోనో ఆ పరిశ్రమను పెట్టొచ్చని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవాలంటే రాష్ట్రవ్యాప్తంగా ఐక్యఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
బల్క్‌డ్రగ్ పేరుతో అమానుషం…
నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల సమస్యలను ఇప్పటికీ పరిష్కరించలేదని బివి రాఘవులు చెప్పారు. 5వేల ఎకరాలు సేకరిస్తే 2వేల ఎకరాలకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఎకరాకు కనీసం రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని పదేళ్ల క్రితం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. గతంలో తక్కువ పొందిన రైతులకు అదనంగా ఇవ్వడంతో పాటు మిగిలిన వారికి వడ్డీతో సహా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, మత్య్సకారులకు కూడా చట్టప్రకారం చెల్లించాల్సిన నష్టపరిహారంపై ఊసేలేదన్నారు. వీటి గురించి ప్రస్తావించకుండా బల్క్‌డ్రగ్ పార్క్ వల్ల రాష్ట్రానికి ఏదో ఓరిగిపోతుందని చెప్పడం అమానుషమని చెప్పారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన వారికి మొండిచెయ్యి చూపించి కంపెనీలకు మాత్రం బంగారు చేయి ఇస్తున్న విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తమ పార్టీ ఒప్పుకోదని అన్నారు. చంద్రబాబు ఇష్టపడే ప్రపంచ బ్యాంకు కూడా నిర్వాసితులే ముందు తరువాతే నిర్మాణం అని చెబుతోందన్నారు. అభివృద్ధికి త్యాగం చేసినవారిని విస్మరించి అభివృద్ధి ఫలాలు పొందేవారిని ప్రేమించడం రాష్ట్రప్రభుత్వానికి సముచితం కాదన్నారు.
తిరుపతి ఘటన విషాదం
తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లలో జరిగిన తొక్కిసలాట విషాధకరమని రాఘవులు అన్నారు. పూజల కోసం వచ్చే భక్తులను రక్షించలేని పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం, టిటిడి పాలకమండలి ఉందని చెప్పారు. ఆదాయం బాగా వచ్చే టిటిడిలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేసుకునే శక్తి లేదా? పాలకమండలికి శ్రద్ధ లేదా? అని ప్రశ్నించారు. రియల్‌టైం గవర్నెన్స్ అని చెప్పే ముఖ్యమంత్రికి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే చర్యలు తీసుకోకపోవడం ఏమటని అన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం, పాలకమండలి వైఫల్యం స్పష్టంగా కనపడుతోందన్నారు. జరిగిన ఘటనకు ప్రభుత్వం, పాలకమండలినే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పారు. దీనికి కారకులైన ప్రధాన వ్యక్తులను పట్టుకోవాలని, అధికారులను బలిచేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ప్రధాని వస్తున్నారని సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులతో పాటు 5వేల మంది పోలీసులు అక్కడ ఉన్నారని తెలిపారు. 10 లక్షల మంది వచ్చే టిటిడి వద్ద కనీసం ఒక్క మంత్రినైనా ఉంచారా? అని నిలదీశారు. ఈ అంశాలన్నింటికీ ముఖ్యమంత్రి, టిటిడిపై ప్రేమ చూపించే ఉపముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం రూ.25లక్షలు కాదని, రూ.కోటి ప్రకటించాలని డిమాండ్ చేశారు. టిటిడి ఆదాయంతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ ఇవ్వొచ్చని, అంతమొత్తంలో పరిహారం ఇస్తేసే టిటిడి గౌరవాన్ని, పవిత్రతను కాపాడిన వారు అవుతారని రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగాలు తక్కువే…
మగ్గురు కలిసి రూ. 2.08లక్షల కోట్ల పెట్టుబడులను ప్రారంభించినా ఉద్యోగాలు పరిమితంగారనే వస్తాయనిమీడియా అడిగిన ప్రశ్నకు రాఘవులు చెప్పారు. హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడికి తగ్గ ఉపాధి ఉండదన్నారు. ఉపాధి కల్పిస్తామని బూటకపు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. గార్మెంట్, లెదర్ రంగాల్లో రూ.2.08లక్షల కోట్లు పెడితే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ వల్ల కూడా ఉపాధి ఉండదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బతికించుకొని గనులు కేటాయిస్తే ఇప్పుడున్న ఉద్యోగాల కంటే అదనంగా వస్తాయని చెప్పారు. రైల్వేజోన్ పేరిట భవనం నిర్మించినందువల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, సమగ్రమైన పద్ధతిలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తేనే ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.