‘ఉక్కు’పై ప్రధాని ప్రకటన చేయాలి

  • విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వస్తున్న ప్రధాని మోడీ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్టు ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1214వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నేతలు డి.ఆదినారాయణ, జి.గణపతి రెడ్డి, దొమ్మేటి అప్పారావు, కెఎస్‌ఎం.రావు, విల్లా రామ్మోహన్‌ కుమార్‌, కామేశ్వరరావు మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయమై కూటమి ప్రభుత్వం మోడీ సర్కారుపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. గత పదేళ్లలో రూ.లక్షల కోట్లను కార్పొరేట్లకు రుణమాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం సకాలంలో వడ్డీలు, అసలు బ్యాంకులకు చెల్లిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆర్థిక సహకారం అందించకపోవడం దారుణమన్నారు. గత పదేళ్ల బిజెపి పాలనలో రాష్ట్రం పట్ల కేంద్రం వివక్షత చూపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ మద్దతు కేంద్రానికి కీలకమైనందున స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయంలో చురుగ్గా ముందుకు కదలాలన్నారు. దీక్షల్లో దాసరి శ్రీనివాస్‌, శ్రీనివాసనాయుడు, గుమ్మడి నరేంద్ర, ఉరుకూటి అప్పారావు, సత్యారావు, వి.అప్పలరాజు, డి.ఈశ్వరరావు, వెంకట్రావు, కనకరాజు పాల్గొన్నారు.

➡️