తాగునీటికి ప్రాధాన్యత

Jun 10,2024 21:12 #crda, #drinking water
  • రాజధానిలో 10 ఎంఎల్‌డి ప్లాంటు నిర్మాణం
  • తాగునీటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం నిర్ణయం
  • వేగంగా పనులు చేస్తున్నాం : కమిషనర్‌ వివేక్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి పనులు వేగవంతం అవడంతో అక్కడకు వచ్చేవారికి, ఇప్పుడున్న భవనాల్లోకి వచ్చేవారికి, హైకోర్టుకు తాగునీటి అవసరాలు తీర్చే అంశంపై సిఆర్‌డిఎ అధికారులు దృష్టి సారించారు. వీలైనంత తొందరగా 10 ఎంఎల్‌డి ప్లాంటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి. దీంతో ఇప్పటికే సగం నిర్మాణం పూర్తయిన ప్లాంటు పనులను వేగవంతం చేశారు. సోమవారం సిఆర్‌డిఎ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ అక్కడకు వెళ్లి పరిశీలించారు. రాజధానిలో తక్షణ అవసరంగా 75 వేల మందికి నీటి అవసరాలు తీర్చేలా ప్లాంటును సిద్ధం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఎపి సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు ఈ ప్లాంటు నుంచి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే రాజధానిలో ముళ్ల కంప తొలగింపు పనులు 24 గంటలూ జరుగుతున్నాయని చెప్పారు. వారంరోజుల్లో దాదాపు క్లియర్‌ చేస్తామని, నేలచదును పనులు కూడా చేపడతామని అన్నారు. రాయపూడిలో సిఆర్‌డిఎ కార్యాలయానికి సోమవారం నుంచి రంగులు వేసే పని మొదలుపెట్టారు.

రాయపూడి నుండే పర్యవేక్షణ
అమరావతి రాజధాని పనులను రాయపూడి కార్యాలయం నుండే పర్యవేక్షణ చేయాలని సిఆర్‌డిఎ అధికారులు నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఇంటీరియర్‌ పూర్తయితే అక్కడ నుంచే పనులు చేపట్టనున్నారు. అలాగే అమరావతి నిర్మాణ ప్రక్రియ మొత్తం పర్యవేక్షించేందుకు అందులోనే కంట్రోల్‌ రూము కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక నుండి ప్రధాన సమీక్షలన్నీ ఆ భవనం నుండే చేయాలని నిర్ణయించారు.

వేగంగా సుందరీకరణ
తొలిదశలో రాజధాని అమరావతిలో రోడ్లపక్కన కంపను తొలగించి వీధిలైట్లు ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా ఉండవల్లి, ప్రకాశం బ్యారేజీ నుండి రాయపూడి వరకూ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును పూర్తిగా విద్యుదీకరించారు. అలాగే ఇప్పుడున్న పూలమొక్కలతోపాటు పెద్దయెత్తున అక్కడ గ్రీనరీ పనులు చేయాలని అధికారులను కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ఆదేశించారు.

➡️