పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

  • ఎపి రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ తక్షణమే అమలు చేయాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎపి రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత 8 మండలాల్లో ఆయా సంఘాలు బృందాలుగా పర్యటించాయి. ప్రజల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం, ప్రజలకు వివరించేందుకు 15 అంశాలతో నేతలు మీడియాకు వివరించారు. ఈ మేరకు విజయవాడలోని ఎంబివికెలో మంగళవారం ఎపి రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన గిరిజనుల పునరావాసానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పునరావాసం తరువాతనే ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవాలని అన్నారు. కాంటూరు లెక్కలన్నీ కాకి లెక్కలేనని, తక్షణమే వాటిని రద్దు చేసి నిర్వాసితులందరికీ ఒకేసారి పరిహారం అందించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి ఇళ్లు ఖాళీ చేయించే నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఒక యూనిట్‌గా గుర్తించి రూ.10 లక్షలు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. 2013 చట్టం ప్రకారం మార్కెట్‌ రేటుకు 4 రెట్లు అదనంగా పరిహారం ఇవ్వాలని, ఇళ్లు, పశువులు, చెట్లకు సంబంధించి పరిహారం ఇవ్వాలని, రవాణాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. గిరిజనులకు భూమికి భూమి అనే విధానాన్ని అమలు చేయాలని, వ్యవసాయానికి అనువైన భూములు ఇవ్వాలని, సురక్షిత ప్రాంతాల్లోనే పునరావాస కాలనీలు నిర్మించాలని, గిరిజనులకు భూమికి భూమి అనే విధానాన్ని అమలు చేయాలని, వ్యవసాయానికి అనువైన భూములు ఇవ్వాలన్నారు. పునరావాస కాలనీల్లో ఇళ్లను నాణ్యంగా నిర్మించాలని, రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, విద్యుత్తు సరఫరా, పాఠశాలలు, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. పోలవరం నిర్వాసితుల్లో చదువుకున్న యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు.
ముంపు గ్రామాల పేరుతో నిలిపేసిన డ్వాక్రా రుణాలను పునరుద్ధరించాలని, పొదుపు, డ్వాక్రా మహిళలకు బ్యాంకుల్లో లింకేజీ లోన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూములకు నష్టపరిహారం ఇచ్చి, పునరావాసం కల్పించేంత వరకు రైతులకు ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించాలని, బ్యాంకుల ద్వారా పంట రుణాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నప్పుడు పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. గోదావరి వరదలను అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టాలని, వరదల సమయంలో ప్రజలకు అవసరమైన బియ్యం, పప్పులు, నూనెలు వంటి ఆహార సరుకులు 3 నెలలకు సరిపడా ఎత్తయిన ప్రాంతాల్లో నిల్వ ఉంచాలని, అన్ని కుటుంబాలకు సరిపడా టెంట్లు, బరకాలు సమకూర్చాలని నాయకులు కోరారు. వరదల కారణంగా పనుల్లేని రోజుల్లో ప్రతి కుటుంబానికీ 200 రోజులు ఉపాధి పనిదినాలు ఉండేలా, రోజుకు రూ.300 వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జిఓ నెంబరు 3ను అమలు చేయాలని, ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

➡️