విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల అప్పగింత?
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకమైన ఎయిర్‌పోర్టులను ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర ప్రవేశపెట్టిన మానిటైజేషన్ పైపులైనులో భాగంగా రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు రద్దీ పెరిగింది. తిరుపతి పోర్టు నిరంతరం పూర్తి ఆక్యుపెన్సీతో ఉంటుంది. అదాయం పెరుగుతూ, రాష్ట్రానికి సేవలందిస్తున్న సమయంలో వీటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి సంబంధించి ప్రక్రియ పూర్తయిందని, దీనికి సంబంధించి విధివిధానాలు త్వరలో వెల్లడిస్తామని పార్లమెంటుసాక్షిగా కేంద్రం ప్రకటించింది. 2023లో కేంద్రం తన పరిధిలోని ఆస్తులను అమ్మి నిధులు సమకూర్చుకునే పనిలో భాగంగా మానిటైజేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. అందులో రాష్ట్రంలో ఎయిర్‌పోర్టులను ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే రైల్వే, ఓడరేవులు ఉన్నప్పటికీ అవి, అందుబాటులోకి వచ్చి అమ్మకాలు జరిపేందుకు సమయం పడుతుంది. ఎయిర్‌పోర్టులు సిద్ధంగా ఉండటంతో వీలైనంత తొందరగా వాటిని అమ్మకాలు జరపాలని ప్రతిపాదించారు. ఇప్పటికే అదానీ వీటికోసం టెండరు వేసినట్లు వార్తలూ వచ్చాయి. చట్ట పరమైన ప్రక్రియలు పూర్తయితే, అదానికి అప్పగించడం దాదాపు ఖాయమని చెబుతున్నారు.
మూడు ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రకటించిన రోజే మానిటైజేషన్‌కు సంబంధించిన అంశం ఢిల్లీలో ప్రస్తావనకు వచ్చింది. దీనికి సంబంధించి విధి విధానాలు వారం రోజుల్లో వెల్లడికానున్నాయని సమాచారం.
దీనిపై పెట్టుబడుల శాఖలోనూ చర్చ జరుగుతోంది. గతంలో విజయవాడ ఎయిర్‌పోర్టు నుండి సింగపూర్‌కు విమానాలు నడిపిన సంగతి తెలిసిందే. విమాన సంస్థలకు నష్టం వస్తే, దానిని ప్రభుత్వమే భరించేలా అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా ఆ తరహా ఒప్పందాలకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర నిర్ణయం వెలువడింది.
