ఆటోను ఢీకొన్న ప్రయివేట్‌ బస్సు.. నలుగురు దుర్మరణం

  • చనిపోయిన బంధువును చూసి వస్తుండగా ప్రమాదం

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య జిల్లా) : అన్నమయ్య జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… సంబేపల్లి మండలం వంగిమళ్లవారిపల్లెలో చనిపోయిన తమ బంధువును చూసేందుకు రాయచోటి నుండి ఆటోలో కలికిరి మండలం దూదేకులవారిపల్లెకు చెందిన కొందరు, నెల్లిమందుకు చెందిన కొందరు వెళ్లారు. తిరిగి వస్తుండగా కలకడ మండలంలోని చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిలో ఇందిరమ్మ కాలనీ సమీపంలో వారి ఆటోను ప్రయివేటు ట్రావెల్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని పకీర్‌ బి, బుజ్జమ్మ, ఖాదర్‌ వలీ, నూరుల్లా అక్కడికక్కడే మృతి చెందారు. యథానుల్లా, దిల్షాద్‌, సారాలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలీసులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. దిల్షాదు, యథానుల్లా పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలాన్ని రాయచోటి డిఎస్‌పి కృష్ణమోహన్‌, సిఐ గురునాథ. ఎస్‌ఐ రామాంజనేయులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️