- త్వరలో క్యాబినెట్ ముందుకు
- అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ : చంద్రబాబు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రైవేటురంగంలో ఇండిస్టియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన విధానాన్ని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను క్యాబినెట్ సమావేశం ముందుకు తీసుకురావాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఇండిస్టియల్ డెవలప్‌మెంట్, ఎంఎస్‌ఎంఇ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దాదాపు ఏడు ఎనిమిది శాఖల్లో మార్పులు, చేర్పులతో నూతన విధానాలను తీసుకురానున్నట్లు తెలిపారు. పరిశ్రమలను ఏర్పాలు చేయడానికి అంగీకారం తెలపడంతోపాటు, వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించే తేదీని ఇచ్చే మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా ముసాయిదా విధానాల్లో ప్రతిపాదించినట్లు చెప్పారు. వీటికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం మాట్లాడిన సిఎం చంద్రబాబు ఇండిస్టియల్ డెవలప్‌మెంట్, ఎంఎస్‌ఎంఇ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా ఐదుశాతం ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రైవేటు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా నివేదిక ఉండాలని తెలిపారు. వాటికి సంబంధించి ఇన్సెంటివ్ విధానం, పరిశ్రమల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై త్వరలో నివేదిక రూపొందించాలని ఆదేశించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మార్గం సుగమం చేసేలా నూతన పాలసీ ఉండాలని సిఎం తెలిపారు. ఎంఎస్‌ఎంఇ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేటు ఇండిస్టియల్ డ్రాప్ట్ పాలసీపై మరింత కసరత్తు జరగాలని తెలిపారు. నూతన పాలసీలతో రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎస్క్రో ఎకౌంట్ ద్వారా ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని, ఇది పారిశ్రామిక ప్రగతికి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని వివరించారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్‌ఎంఇ పాలసీ ఉండాలన్నారు. పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరుతో అమరావతిలో రతన్ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేలా టాటా ఇన్నోవేటివ్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సిఎం ప్రకటించారు. ఇది స్కిల్స్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా ఉంటుందని తెలిపారు. దీనికి అనుబంధంగా రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో మల్టీనేషన్ కంపెనీ మెంటార్‌గా ఉండేలా ప్లాను చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగ కల్పన తమ ప్రభుత్వ విధానమని, దానికి అనుగుణంగా నూతన విధానాలు ఉండాలని సిఎం అన్నారు. సిఎస్ నీరబ్‌కుమార్ ప్రసాదు మాట్లాడుతూ ఆక్వా, పౌల్ట్రీ రంగాల్లో వచ్చిన విధంగానే ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఫలితాలు వచ్చేలా విధానాలు అమలు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు టిజి భరత్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.