ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలి

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని, వాటిని కట్టిపెట్టి ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని సిఐటియు సీనియర్‌ నాయకులు ఎన్‌.రామారావు డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1456వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు, ఉక్కు కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ రూ.38,684 కోట్లు అప్పుల్లో ఉన్నట్టు ఉక్కు శాఖ మంత్రి చెబుతున్నారని, ఆ అప్పులకు కారణం ముడి ఇనుప ఖనిజాన్ని బయట మార్కెట్‌లో కొనుగోలు చేయడమేనని తెలిపారు. సొంత గనులను స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఉక్కు నిపుణులు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వ చెవికెక్కడం లేదన్నారు. 31 లక్షల టన్నుల హాట్‌ మెటల్‌ను రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసిన స్టీల్‌ కార్మికులకు ఐదు నెలలుగా పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. కార్మికుల జీవన శైలిని దెబ్బతీస్తున్న స్టీల్‌ యాజమాన్యం వైఖరిని గుర్తింపు సంఘం ప్రశ్నించాలని కోరారు. ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. కార్మిక వర్గం ఐక్య పోరాటాలతో ప్లాంట్‌ను కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కె.గంగాధర్‌, భానుమూర్తి, జగ్గారావు, రామ్మోహన్‌ కుమార్‌, విజరు కుమార్‌, కె.సత్యనారాయణ, డిసిహెచ్‌.వెంకటేశ్వరరావు, కె.అప్పారావు పాల్గన్నారు.

➡️