పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

  • సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు
  • రాజకీయ తొలగింపులు ఆపాలని ఎండిఎం సదస్సు తీర్మానం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వేతనాలు పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన కార్మికులపై రాజకీయ కారణాలతో వేధింపులు, తొలగింపులు ఆపాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. పిల్లలపై ప్రేమతో కేవలం అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్‌ ఇచ్చి కాపాడుతోంది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును సూచించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌.. కార్మికుల వేతనాలు పెంచేందుకు చొరచ చూపాలని కోరారు. సమస్యలు పరిష్కారం కోసం కార్మికులు చేసే పోరాటాలకు సిఐటియు అండగా ఉంటుందని చెప్పారు. యూనియన్‌ మాజీ కార్యదర్శి కె స్వరూపరాణి మాట్లాడుతూ.. ధరలు పెరుగుదలకు అనుగుణంగా పిల్లలకు ఇచ్చే మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. మెనూ ఛార్జీలకు సంబంధం లేకుండా రోజుకో ఐటెంతో ప్రభుత్వాలు మెనూ తయారు చేసి వర్కర్లపై భారాన్ని మోపుతున్నాయని పేర్కొన్నారు. ఒకపక్క పనిభారం, మరోపక్క ధరల భారంతో కార్మికులు పథకం నిర్వహించటం కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలకు పథకాన్ని అప్పగించొద్దని డిమాండ్‌ చేశారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో కూడా కార్మికులకు అప్పగించాలని కోరారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు పెంచాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం అందిస్తే గత ప్రభుత్వం పేరు చెప్పి తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు, బిల్లులు ఇవ్వాలని కోరారు. మెనూ ఛార్జీలు కనీసం రూ.20 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేసి, పథకం అమలుకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. గుర్తింపు కార్డులిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పాఠశాలల్లో ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటుచేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. వంట సమయంలో అగ్ని ప్రమాదానికి గురైన వారికి నష్ట పరిహారం రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులపై రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని సదస్సు తీర్మానం చేసింది. యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌సిహెచ్‌ సుప్రజ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, యూనియన్‌ నాయకులు ఎం నాగమణి, విజయమ్మ, ఈశ్వరి, సుధా, మంగశ్రీ, తులసి, శ్రీదేవి, భాస్కర్‌రావు, మురళి తదితరులు పాల్గొన్నారు.

➡️