కేంద్రం దృష్టికి టెక్స్‌టైల్స్‌ పరిశ్రమల సమస్యలు

  • కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయని, ముఖ్యంగా టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలు చాలా సమస్యల్లో ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించేలా కృషి చేస్తామనని కేంద్ర గ్రామీణాభివృద్ధి, టెలికమ్యూనికేషన్స్‌ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గోపాలవారిపాలెం టెక్స్‌టైల్‌ పార్క్‌ను నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులతో కలిసి మంత్రి శనివారం ఆయన సందర్శించారు. పరిశ్రమల యజమానులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుల్లారావు పలు సమస్యలను ప్రస్తావించారు. జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లులు సహా పత్తి ఆధారిత పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయని, దేశంలో సగం మిల్లులు ఇప్పటికే మూతపడ్డాయని, మిగతావి నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. పత్తికి మద్దతు ధరను కేంద్రం కొంత పెంచినా రైతులు కష్టాలు తీరడం లేదన్నారు. పైర్లకు తెగుళ్లు సోకి, దిగుబడి తగ్గుతోందని తెలిపారు. ఈ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, సంక్షోభంలో ఉన్న కాటన్‌ పరిశ్రమలను ఆదుకునేందుకు కృషి చేస్తామని మంత్రి చంద్రశేఖర్‌ హామీ ఇచ్చారు.

➡️