సమస్యలు పరిష్కరించాలి

  • జీతాలు పెంచి బకాయిలు చెల్లించాలి
  • పంచాయితీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ధర్నా
  • ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు రాయబారం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఉపముఖ్యమంత్రి పవణ్‌ కళ్యాణ్‌ క్యాంపు కార్యాలయం వద్ద యూనియన్‌ ఆధ్వర్యాన గురువారం ధర్నా జరిగింది. ముందుగా మంగళగిరి నుంచి క్యాంపు కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం అక్కడే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులతో ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు మారుతున్నా కార్మికుల జీవితాల్లో మార్పు రావడం లేదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి పది నెలలు గడుస్తోందని, ఇప్పటివరకు కార్మికుల సమస్యలపై ఒక్కసారి కూడా స్పందించలేదని విమర్శించారు. గుర్తింపు కార్డు, కనీస వేతనం, పిఎఫ్‌, ఈఎస్‌ఐ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం 1999, 2019 సంవత్సరాల్లో ఉత్తర్వులు విడుదల చేసినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు. మున్సిపల్‌ కార్మికులు మాదిరిగా విధులు నిర్వహిస్తున్నా వారితో సమానంగా( రూ.21 నుంచి రూ24,500)జీతాలు చెల్లించడం లేదని, కేవలం రూ.4 నుంచి 12వేలు మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. గ్రీన్‌ అంబాసిడర్లకు 18 నెలలుగా జీతాలు లేని చెప్పారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన కార్మికులే ఎక్కువగా ఉన్నారని, వీరికి ప్రభుత్వాలు తీరని అన్యాయం చేయడం సరికాదన్నారు. తక్షణమే పవన్‌ కళ్యాణ్‌ స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

యూనియన్‌ అధ్యక్షులు డి వెంకట్రామయ్య మాట్లాడుతూ 35 ఏళ్లుగా వెట్టిచాకిరీ చేస్తున్నామని, కరోనా, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలకు అండగా నిలబడి గ్రామాలను పరిశుభ్రం చేసి ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నామని చెప్పారు. టెండర్ల పేరుతో ప్రతి ఏటా అక్రమ వసూళ్లు చేస్తున్నారని, వీటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఉపాధ్యక్షులు ఎం పోలి నాయుడు, జి రామాంజనేయులు, కోశాధికారి కె శ్రీనివాసరావు, నాయకులు బి లక్ష్మణరావు, ప్రసంగించిన ఈ కార్యక్రమంలో కార్యదర్శులు శివప్రసాద్‌, సిహెచ్‌ సుబ్బారావు, వి రాము, నాయకులు శ్రీనివాసరావు, నాగన్న తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ హరిప్రసాద్‌కు రాయబారం అందజేత

సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల నుంచి సేకరించిన వేలాది సంతకాల పత్రాలను జనసేన ఎమ్మెల్సీ పి హరిప్రసాద్‌కు యూనియన్‌ నాయకులు అందజేశారు. ఉపముఖ్యమంత్రితో ఐదు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హరిప్రసాద్‌ వారికి హామీఇచ్చారు. అనంతరం పంచాయితీ రాజ్‌ శాఖ డైరెక్టర్‌ కృష్ణతేజ్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

➡️