- డిఎస్సి రోడ్డు మ్యాప్ ప్రకటించాలి
- ప్రైవేట్ యూనివర్సిటీలను నియంత్రించాలి
- మండలిలో పిడిఎఫ్ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయడంతో పాటు, డిఎస్‌సికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని పిడిఎఫ్ డిమాండ్ చేసింది. విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలపై శాసనమండలిలో బుధవారం చర్చ జరిగింది. ఈ చర్చల్లో పాల్గొన్న పిడిఎఫ్ సభ్యులు ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు సుమారు 5వేల వరకు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కోర్టు కేసులు అడ్డంకి పేరుతో భర్తీ చేయడం లేదన్నారు. బోధించే సిబ్బంది లేకుండా యూనివర్సిటీలు ఎలా పనిచేస్తాయని ప్రశ్నించారు. కోర్టు కేసులు పరిష్కరించి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిఆర్ అంబేద్కర్, తెలుగు యూనివర్సిటీల కేంద్రాలను రాష్ట్రంలో ప్రారంభించి అడ్మిషన్లు నిర్వహించాలని కోరారు. ప్రైవేట్ యూనివర్సిటీలపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీల్లో విద్యార్ధుల సంఖ్యకు పరిమితి లేదని, సీట్ల భర్తీలో రిజర్వేషన్ల విధానం లేదన్నారు. ఫీజులపై కూడా నియంత్రణ లేదన్నారు. ఎలాంటి ప్రమాణాలు లేకుండా రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం డిగ్రీ కోర్సుల్లో మేజర్, మైనర్ విధానం ప్రవేశపెట్టిందని, దీనివల్ల కొన్ని సబ్జెక్టుల్లో మాత్రమే విద్యార్ధులు చేరుతున్నారని తెలిపారు. కాబట్టి మేజర్, మైనర్ విధానాన్ని పున: పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రైవేట్ కళాశాలల్లో పిజి విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపచేయకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జివో 77ను రద్దు చేయాలని కోరారు. స్థానిక సంస్థలు ప్రజల నుంచి వసూలు చేస్తున్న గ్రంథాలయాల పన్నును గ్రంథాలయాలకు చెల్లించాలని కోరారు. తెలుగు అకాడమీ కోసం శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి తొలిసంతకం చేసిన మెగా డిఎస్సి భర్తీకి రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.
రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా బోధన: ఐ వెంకటేశ్వరరావు
దేశ రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలల్లో బోధన ఉండాలని మరో పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. పాఠ్యాంశ పుస్తకాలు, సిలబస్ రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని కొఠారి కమిషన్ చెప్పిందన్నారు. పాత భావాలు,పనికిరాని భావాలు కాకుండా దేశం, సమాజానికి ఉపయోపడే పద్దతుల్లో రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా సూక్తులు, బోధనలు ఉండాలని సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక విద్యను విధ్వంసం కావడానికి ప్రపంచబ్యాంకు, దాని అనుబంధ ప్రాజెక్టులే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యను ప్రపంచ బ్యాంకు ప్రయోగశాలగా మార్చారన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా వారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పాఠశాల విద్యను మార్చేశారని విమర్శించారు. కొఠారి కమిషన్ మార్గదర్శకాలను పరిగణన లోకి తీసుకోకుండా పిల్లలకు బడిని దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలోనే జరగాలని, అప్పుడే పిల్లలకు అర్ధమవుతోందన్నారు. కానీ రాజకీయ ప్రయోజనం కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారని చెప్పారు. 2007లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిబిఎస్‌ఇ సిలబస్ విధా నాన్ని తీసుకొచ్చేందుకు అభిప్రాయాలు, చర్చలు నిర్వహించిం దన్నారు. జాతీయ పరిశోధన విద్యామండలి(ఎన్‌సిఇఆర్‌టి) కంటే రాష్ట్ర పరిశోధన విద్యామండలి (ఎస్‌సిఇఆర్‌టి) సిలబస్ బాగుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిందన్నారు.