శాస్త్రీయ దృక్పథంతోనే పురోగతి

  • తిరోగామి శక్తులతో విఘాతం
  • జెవివి వార్షిక మహాసభలో సవ్యసాచి ఛటర్జీ

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : శాస్త్రీయ దృక్పథంతోనే మానవ పురోగతి సాధ్యమని ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్సు నెట్‌వర్క్‌ (ఎఐపిఎస్‌ఎన్‌) మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ సవ్యసాచి ఛటర్జీ పేర్కొన్నారు. అనంతపురంలోని జిఆర్‌.ఫంక్షన్‌ హాలులో రెండు రోజులపాటు జరగనున్న జెవివి 17వ వార్షిక మహాసభ శనివారం ప్రారంభమైంది. నగరంలోని జిఆర్‌.ఫంక్షన్‌ హాలులో ప్రొఫెసర్‌ భాగ్యవతి హాలులోని ఆదినారాయణ ప్రాంగణంలో మహాసభను నిర్వహిస్తున్నారు. మహాసభ ప్రారంభం సందర్భంగా సమతా కన్వీనర్‌ డాక్టర్‌ ప్రసూన జాతీయ పతాకాన్ని, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ రంగన్న జెవివి పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా జన విజ్ఞాన వేదికలో పనిచేసి మరణించిన ప్రొఫెసర్‌ భాగ్యవతి, లకీëనారాయణ, ఈశ్వరయ్య తదితరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ గేయానంద్‌ అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం హాజరై ప్రారంభ సందేశాన్ని ఇచ్చారు.
అనంతరం ‘సైంటిఫిక్‌ టెంపర్‌-ఛాలంజెస్‌’ అనే అంశంపై ప్రొఫెసర్‌ సవ్యసాచి ఛటర్జీ మాట్లాడుతూ దేశంలో గూడుకట్టుకున్న అశాస్త్రీయ భావాలకు వ్యతిరేకంగా 1882 నుంచే రాజా రామ్మోహన్‌ రారు వంటి వారు పనిచేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత స్వాతంత్రోద్యమ కాలంలోనూ శాస్త్రీయతపై మరింతగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ స్ఫూర్తితోనే స్వాతంత్య్రం అనంతరం కూడా శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో పెంపొందించాలని రాజ్యాంగంలో పొందుపరినట్లు వివరించారు. ఇటీవల తిరోగామి శక్తులు ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపుదలకు వ్యతిరేకంగా పని చేస్తుండడం విచారకరమన్నారు. ఈ అవరోధాన్ని అధిగమించే దిశగా సైన్స్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయత పెరుగుతున్న కొద్దీ అశాస్త్రీయత కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. దేశంలో మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జెవివి గౌరవాధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు అశాస్త్రీయ ఆలోచనలున్న వారు అధికార పీఠమెక్కి కూర్చున్నారని తెలిపారు. శాస్త్రీయ ఆలోచనల వ్యాప్తిలో ఇప్పుడున్న అవరోధాల కంటే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని సైన్స్‌ ప్రచారకులు గమనంలో ఉంచుకోవాలన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్‌ పాల్గొని సౌహార్ద సందేశమిచ్చారు. సైన్స్‌ వేరు, టెక్నాలజీ వేరని వివరించారు. సైన్స్‌ పెంపుదలపై ప్రస్తుతం తగినంత ప్రోత్సాహం ఉండడం లేదన్నారు. దీన్ని పెంపొందించడంలో కీలకంగా వ్యవహరించే విశ్వవిద్యాలయాల్లోనే పరిశోధనలు జరగకపోవడం శోచనీయమన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో సైన్స్‌ ఉద్యమంతో కలసి యుటిఎఫ్‌ పనిచేస్తోందన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో ప్రభుత్వాలు తీసుకొస్తున్న మార్పులతో విద్యార్థుల్లో శాస్త్రీయత కొరవడే అవకాశాలున్నాయని తెలిపారు. సామాజిక కార్యకర్త బోస్‌ మాట్లాడుతూ విద్య, వైద్యంలో శాస్త్రీయతను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, ఉపాధ్యక్షులు భాస్కర్‌, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ హేమలత, సమతా కన్వీనర్‌ డాక్టర్‌ ప్రసూన, జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి లకీëనారాయణ, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి డాక్టర్‌ ఆదిశేషు, మెడికల్‌ రిప్రజంటేటివ్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు మనోహర్‌, కవి, రచయిత కంబదూరు షేక్‌ నబిరసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ హేతువాది రాధాకృష్ణమూర్తి
జెవివి వార్షిక మహాసభలో ప్రముఖ హేతువాది రాధాకృష్ణమూర్తి ప్రత్యేక ఆకర్షగా నిలిచారు. 90 ఏళ్ల వయసులోనూ ఆయన జెవివి వార్షిక మహాసభకు విచ్చేయడం అందరినీ ఆకట్టుకుంది. నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నా, కర్ర పట్టుకుని ఇతరుల సహాయంతో విచ్చేశారు.

➡️