ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా అనుకూలమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామం అని శనివారం ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వికసిత భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందని తెలిపారు. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తోందని వివరించారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్ పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలియజేశారు.
