నిర్మాణ రంగానికి ప్రోత్సాహం

  • టిడిఆర్‌ బాండ్ల దోషుల్ని శిక్షిస్తాం
  • రూ.50 వేల కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు
  • నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభంలోసిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించి ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో నరెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను శుక్రవారం ఆయన ప్రారంభించారు. నరెడ్కో ప్రాపర్టీ షో చైర్మన్‌ గద్దె తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నిర్మాణం రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ‘బ్రాండ్‌ ఎపి’ ఇమేజ్‌తో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ‘రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, పర్యాటకం ఊపందుకోవాలి, సంపద పెరగాలి’.. అప్పుడే రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడ్డాయన్నారు. వైసిపి పాలనలో ఇసుక లభించక నిర్మాణ రంగం దెబ్బతిందని, అందువల్లే అధికారంలోకి రాగానే ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం వాటా జిడిపిలో 7.3 శాతం ఉందని, 2047 నాటికి 20 శాతం పెరిగి, 5.8 ట్రిలియన్‌ డ్రాలర్లు ఆర్జిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. ‘టిడిఆర్‌ బాండ్లలో డబ్బులు తీసుకుంది ఒకరు… నష్టపోయింది ఇంకొకరు. దీన్ని కూడా గత పాలకులు అక్రమాలకు వాడుకున్నారు. అవినీతికి పాల్పడ్డ వారిని వదలిపెట్టం… అమాయకుల్ని కాపాడతాం’ అని చంద్రబాబు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రూ.50 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. అమరావతి చుట్టూ 183 కి.మీ మేర రింగ్‌ రోడ్డుకు ప్లాన్‌ సిద్ధం చేశామన్నారు. ఈ రోడ్డు పూర్తయితే గుంటూరు-అమరావతి పట్టణాలు కలిసిపోతా యన్నారు. ఎపిని గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా మార్చుస్తామని తెలిపారు. ‘ఐటిని అందిపుచ్చుకొని విదేశాలకు వెళ్లిన వారిలో గుంటూరు వాసులు ఎక్కువగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. అందివచ్చిన అవకాశాల నుఅందిపుచ్చుకుంటారని కొనియాడారు.

అమరావతి లాంటి నగరం మరొకటి రాదు

‘దేశంలో అమరావతి లాంటి నగరం మరొకటి రాదని, కొత్త నగరాన్ని బెస్ట్‌ మోడల్‌ సిటీగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అమరావతితోపాటు విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి లాంటి పట్టణాలను అభివద్ధి చేస్తామన్నారు. ఉచిత ఇసుకలో అక్రమాలను సహించబోమని హెచ్చరించారు. సభలో మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ ఐదు అంతస్తుల భవనాల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు అవ సరం లేదన్నారు. సభలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నశీర్‌ అహ్మద్‌, బి.రామాంజనేయులు, నరెడ్కో నేషనల్‌ ప్రెసిడెంట్‌ జివి హరిబాబు, రాష్ట్ర అధ్యక్షులు చక్రధర్‌, ప్రాపర్టీ షో చైర్మన్‌ గద్దె తిరుపతిరావు పాల్గొన్నారు.

➡️