జిల్లా యూనిట్‌గా జనాభా దామాషా పద్ధతిలో వర్గీకరణ

  • అమలుకు కమిషన్‌ ఏర్పాటు
  • దళిత ఎమ్మెల్యేల సమావేశంలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జనాభా దామాషా పద్ధతిలో జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనివల్ల దళితులకు సమాన అవకాశాలు వస్తాయని తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలో దళిత ఎమ్మెల్యేలతో సిఎం చంద్రబాబు వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉప కులాలు అందరికీ దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతం ఇచ్చేలా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు వర్గీకరణ అమలుకు సిద్ధమాయ్యయని, ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా యూనిట్‌గా చేయాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తొలి నుండీ దళితులకు అండగా ఉందని, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపామని పేర్కొన్నారు. 2014 తరువాత జిఓ నెంబరు 25తో దామాషా ప్రకారం దళితులకు నిధులు ఖర్చు పెట్టామని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టత వచ్చిన నేపథ్యంలో కార్యాచరణ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సిఎం పేర్కొన్నారు. దీనికోసం కమిషన్‌ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే దళిత వర్గాన్ని పైకి తెచ్చే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మొదలుపెడతామని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల ద్వారా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, 2014లో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల ఏర్పాటు కూడా అందులో భాగమేనని అన్నారు. చంద్రన్నబాట పేరుతో దళితవాడల్లో సిమెంటు రోడ్లు వేశారని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. గత ఐదేళ్లలో దళితవాడల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. అందువల్లే రాష్ట్రంలో రెండుచోట్ల మినహా అన్ని దళిత నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. గ్రామాల్లో ఎక్కువ మంది దళితులు కౌలురైతులుగా ఉన్నారని, వారికి ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు అందేలా చూడాలని కోరారు. ప్రభుత్వం చేస్తుందని, ఎమ్మెల్యేలు కూడా కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఉండేందుకు వీలుగా సంక్షేమ చర్యలు తీసుకోవాలని సిఎం వారికి సూచించారు.

➡️