కార్మికుల ప్రాణాలకు రక్షణేది?

  • భద్రత పాటించని యాజమాన్యాలు
  • విశాఖ కార్మిక శాఖ కార్యాలయం వద్ద ధర్నా

ప్రజాశక్తి-సీతమ్మధార (విశాఖపట్నం) : పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించాలని, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, భద్రత పాటించని యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని కోరుతూ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన విశాఖ అక్కయ్యపాలెంలోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్‌ అచ్యుతరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, ఎఐఎఫ్‌టియు కార్యదర్శి గణేష్‌ పాండా మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయన్నారు. పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఇటీవల ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఐదుగురు చనిపోవడం మరవకముందే అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్‌లోని ఎసెన్సీయా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి 17 మంది, ఆ తరువాత రోజే పరవాడలో సినర్జీయన్‌ కంపెనీలో నలుగురు తీవ్రగాయాలపాలై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. లాభాలే పరమావధిగా యజమానుల ఉంటున్నాయి తప్ప కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలంలో 120 ప్రమాదాలు జరిగితే 121 మంది కార్మికులు చనిపోయారని ప్రభుత్వమే నివేదిక అందజేసిందని గుర్తుచేశారు. పరిశ్రమలలో తనిఖీలు చేయనవసరం లేదని, యాజమాన్యాలు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుందని గతంలో చంద్రబాబు ప్రభుత్వం జిఒ 64 తీసుకొచ్చినప్పటి నుంచి పరిశ్రమలలో తనిఖీలు జరగడం లేదన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ పేరుతో పరిశ్రమలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం చట్టాలను గాలికి వదిలేయడమేనని అన్నారు. ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ బిజినెస్‌ పేరుతో ఇంకా స్వేచ్ఛగా యాజమాన్యాలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారని, ఇటువంటి విధానాల వల్లే కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో కలిసి ప్రమాదాల నివారణపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు. అనంతరం కార్మిక శాఖ అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు, పి.వెంకట్రావు, ప్రకాశరావు, చంద్రశేఖర్‌, శివ, ఎఐటియుసి నాయకులు వామనమూర్తి, బి.వెంకట్రావు, సత్యాంజనేయ, సత్యనారాయణ, కాసుబాబు, ఐఎఫ్‌టియు నాయకులు మల్లన్న, తిరుపతిరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

➡️